కలవ లేదు కానీ ... లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి ? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను తాను కలవ లేదని, కానీ కలిస్తే
తప్పేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్‌ను అర్ధరాత్రి
కలిశానంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. "మేం ఏం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన
కర్మ మాకు లేదు. అయినా... నాకు తెల్వక అడుగుతా... లోకేశ్ ఏమైనా అంతర్ రాష్ట్ర
దొంగనా ?
సంచులు
మోసినోడా ? చదువు
రానోడా ?
కలవ లేదు
కానీ... కలిస్తే తప్పేంది ?" అని కేటీఆర్ నిలదీశారు. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడైన లోకేశ్‌తో
తనకు సత్సంబంధాలు ఉన్నాయని, తాము స్నేహపూర్వకంగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
"కలవ లేదు కానీ... కలిస్తే తప్పేంది ? అయినా ఆయన మీ పెద్ద బాస్
చంద్రబాబు కొడుకే కదా ? నేనేదో గూండాను, దావూద్ ఇబ్రహీంను చీకట్లో కలిసినట్లు
ఆ డైలాగులు ఏంది ? నేను
అడిగింది ఏంది ? నేను
చెప్పింది ఏంది ? నేను
ఏమైనా దొంగను కలిశానా ? నేను లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ? ఢిల్లీలో చీకట్లో పోయి
అమిత్ షా కాళ్లు పట్టుకుని, మోదీ పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా ?" అంటూ రేవంత్ రెడ్డిపై
విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్ర మంత్రి ... యువకుడు ... తనకు తమ్ముడిలాంటోడు ... కలిస్తే
కలుస్తానని, కానీ
తాను కలవ లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. పాలన గురించి తెలుసుకోవాలంటే తమను
కలుస్తారని, దోపిడీ
గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని కలుస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లోకేశ్ తనను
కలిస్తే రేవంత్ రెడ్డికి ఎందుకంత బాధని ప్రశ్నించారు. ఈ చిల్లర మాటలతో ఇంకెన్ని
రోజులు కాలక్షేపం చేస్తారని, ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేయడానికి ప్రయత్నిస్తారని
మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా కిట్టీ పార్టీ ఆంటీలా
వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక, చీకట్లో చిట్‌చాట్‌ల
పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్య బట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
అంతకు ముందు కేటీఆర్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో పువ్వాడతో
కలిసి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. అబద్ధపు
హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బోగస్
మాటలు చెప్పి మోసం చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను, రూ.4 వేల పెన్షన్ ఇస్తామని
చెప్పి వయో వృద్ధులను, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలను మోసం
చేశారని మండి పడ్డారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుందని ప్రజలు
బాధపడుతున్నారని, వంద
రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వంపై
ప్రజలకు తీవ్ర స్థాయిలో కోపం ఉందని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు
సూచించారు. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత సమష్టిగా తీసుకుందామన్నారు. స్థానిక
సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సహకారం ఉంటుందని చెప్పారు. ఇప్పటికిప్పుడు
ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో రేవంత్, బీజేపీలకు తెలుసన్నారు. కేసీఆర్ 100 సీట్లతో ఏకపక్షంగా
అధికారంలోకి వస్తారని అందరికీ తెలుసని పేర్కొన్నారు.
ముగ్గురు మంత్రులున్నా ... అభివృద్ధి సున్నా
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం సున్నా అన్నారు. ఆ ముగ్గురు మంత్రులు మాత్రం ముగ్గురు మొనగాళ్లులా తిరుగుతున్నారని విమర్శించారు. ఓ మంత్రి బాంబులు... బాంబులు అంటూ తిరుగుతున్నారని, చివరికి పొంగులేటి కాస్తా బాంబులేటిగా అయ్యారని ఎద్దేవా చేశారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంకొకాయన కమీషన్ల మంత్రి .. ఆయన కమీషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ చంద్రవతి పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని, కరకగూడెంలో మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును కేటీఆర్ పరామర్శించారు. కాంతారావు తల్లి రేగా నర్సమ్మ ఇటీవలే మరణించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మదన్ లాల్, రేగా నర్సమ్మ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రేగా కాంతారావు ఇంటి వద్ద బోజనం చేశారు.



Comments
Post a Comment